Pranab Mukherjee: సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లపై ఆత్మకథలో ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు

Pranab Mukherjee Blames Sonia Gandhi and Manmohan Singh
  • ఈ ఏడాది జులైలో కొవిడ్‌తో మృతి చెందిన ప్రణబ్
  • వచ్చే నెలలో విడుదల కానున్న ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’
  • మోదీ ఐదేళ్ల పాలనలో నియంతృత్వ పోకడలు కనిపించాయన్న మాజీ రాష్ట్రపతి
మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన దృష్టి కోణం నుంచి పక్కకు జరిగిందని, పార్టీ వ్యవహారాలను సోనియాగాంధీ సరిగా నిర్వర్తించలేకపోయారని ప్రణబ్ పేర్కొన్నారు.

మన్మోహన్‌సింగ్‌కు, ఎంపీలకు మధ్య వ్యక్తిగత సంప్రదింపులు లేకపోవడం వల్లే పార్టీ పతనమైందని ప్రణబ్ తన ఆత్మకథ ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’లో రాసుకొచ్చారు. వచ్చే నెలలో ఇది పబ్లిష్ కానుంది. ఈ నేపథ్యంలో పుస్తకాన్ని ప్రచురిస్తున్న రూపా పబ్లిషర్స్ అందులోని కొన్ని వ్యాఖ్యలను బహిర్గతం చేసింది.

తను కనుక 2004లో ప్రధానిని అయి ఉంటే 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి నుంచి బయటపడేదని చాలామంది తనతో చెప్పారని పుస్తకంలో పేర్కొన్న ప్రణబ్.. వారి అభిప్రాయాన్ని తాను అంగీకరించలేదన్నారు. అయితే, తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత మాత్రం పార్టీపై హైకమాండ్ దృష్ణి కోణం మారిందని, పార్టీని నడిపించడంలో సోనియా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎంపీలు, మన్మోహన్‌కు మధ్య ఎడం పెరిగిందని, ఆయనతో ఎంపీలు వ్యక్తిగతంగా మాట్లాడలేకపోయారని వివరించారు. కూటమిని రక్షించుకునేందుకు మన్మోహన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపైనా ప్రణబ్ విమర్శలు చేశారు. మోదీ తన తొలి ఐదేళ్ల పాలనలో నియంతృత్వాన్ని అనుసరించినట్టే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య చేదు సంబంధాలు నెలకొన్నాయని అన్నారు. రెండోసారి అధికారంలోకి రావడంతో ఈసారి అది మరింత స్పష్టంగా అర్థమవుందా? అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని ప్రణబ్ పేర్కొన్నారు. ప్రణబ్ 84 ఏళ్ల వయసులో ఈ ఏడాది జులై 31న కొవిడ్‌తో మరణించారు.
Pranab Mukherjee
Narendra Modi
Sonia Gandhi
Congress
BJP
Manmohan singh

More Telugu News