farm laws: వ్యవసాయ చట్టాల సంస్కరణలతో ఆ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి: మోదీ వ్యాఖ్యలు
- రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది
- సంక్షోభంలో నేర్చుకున్న విషయాలు దేశాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి
- విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి
- ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌తో ప్రతి రంగంలోనూ సామర్థ్యానికి ప్రోత్సాహం
కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు చేస్తోన్న ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సంస్కరణలతో వ్యవసాయ రంగంలో అధికంగా పెట్టుబడులు వస్తాయని, రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సంక్షోభంలో నేర్చుకున్న విషయాలు దేశాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు. తాము తీసుకుంటోన్న చర్యల వల్ల దేశంలో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని చెప్పుకొచ్చారు.
భారత్‌పై ప్రపంచం చూపిస్తోన్న నమ్మకం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. గత విధానాలు అనేక రంగాల్లో కొత్త ప్రయోగాలను నిలిపివేశాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌తో ప్రతి రంగంలోనూ సామర్థ్యానికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.