Rishabh Pant: బ్యాటింగ్ ప్రాక్టీసు అదిరింది... ఆస్ట్రేలియా-ఏ బౌలర్లను ఊచకోత కోసిన పంత్
- సిడ్నీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా-ఏ మూడ్రోజుల మ్యాచ్
- రెండో ఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్లకు 386 పరుగులు
- ప్రస్తుతం భారత్ ఆధిక్యం 472 రన్స్
- 73 బంతుల్లోనే 103 పరుగులు చేసిన పంత్
- 9 ఫోర్లు, 6 సిక్సులు బాదిన వైనం
- సెంచరీ సాధించిన తెలుగుతేజం హనుమ విహారి
డిసెంబరు 17 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా అడిలైడ్ లో పింక్ బాల్ డే/నైట్ టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ కు సన్నాహకంగా ప్రస్తుతం భారత జట్టు సిడ్నీలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో మూడ్రోజుల మ్యాచ్ ఆడుతోంది. రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్ మెన్ విశ్వరూపం ప్రదర్శించారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (61), వన్ డౌన్ బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ (65) నిలకడ ప్రదర్శించగా, లోయరార్డర్ లో వచ్చిన చిచ్చరపిడుగు రిషభ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు.
పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడం ఇవాళ్టి ఆటలో హైలైట్ గా నిలిచింది. పంత్ కేవలం 73 బంతుల్లోనే 103 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. పంత్ స్కోరులో 9 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. మరో ఎండ్ లో తెలుగుతేజం హనుమ విహారి కూడా సెంచరీ సాధించాడు. విహారి ఎంతో ఓపిక ప్రదర్శించి 194 బంతులు ఎదుర్కొని 104 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
కెప్టెన్ రహానే 38 పరుగులు చేశాడు. దాంతో భారత్ రెండో రోజు ఆటచివరికి రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. కాగా, రేపు మ్యాచ్ కు చివరి రోజు కాగా, ప్రస్తుతం భారత్ ఆధిక్యం 472 పరుగులకు చేరింది. రేపు ఉదయం ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది.