Donald Trump: యూఎస్ సుప్రీం తీర్పుపై మండిపడిన ట్రంప్!
- సోమవారం సమావేశం కానున్న ఎలక్టోరల్ కాలేజ్
- బైడెన్ ను ఎన్నుకుంటే ట్రంప్ వైట్ హౌస్ ను వీడాల్సిందే
- సుప్రీం తీర్పు దేశాన్ని ఇరుకున పెట్టిందన్న ట్రంప్
యూఎస్ అధక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని తాను చేస్తున్న వాదనలో పస లేదని తేలిపోవడంతో డొనాల్డ్ ట్రంప్, ఇక వైట్ హౌస్ ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా, యూఎస్ సుప్రీంకోర్టు సైతం ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని వేసిన పిటిషన్లను కొట్టివేయడంతో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోయినట్టే, ఇక సోమవారం నాడు ఎలక్టొరల్ కాలేజ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా బైడెన్ ను ఎంచుకుంటే, ట్రంప్ ఇక బాధ్యతలు అప్పగించి వెళ్లాల్సిందే.
అయితే, ఇప్పటికీ, ట్రంప్ తన ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. సుప్రీంకోర్టు తీర్పుపై మండిపడుతూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఈ తీర్పు దేశాన్నే ఇరుకున పెట్టేలా ఉందంటూ తన మదిలోని అక్కసును వెళ్లగక్కారు. ఇటువంటి తీర్పుతో న్యాయాన్ని అవమానించినట్టు అయిందని వ్యాఖ్యానించారు. ఆపై ఓ వీడియో సందేశాన్ని ఇస్తూ, కరోనాను నిర్మూలించే రోజులు దగ్గర పడ్డాయని, కేవలం 9 నెలల వ్యవధిలోనే సురక్షితమైన టీకాను యూఎస్ తయారు చేసిందని అన్నారు. యూఎస్ లో టీకాను వాడేందుకు ఎఫ్డీయే అనుమతించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.