Farmers: డెడ్ లైన్ 18... 19 నుంచి లక్షల మంది ఆమరణ దీక్ష... కేంద్రానికి రైతుల అల్టిమేట్టం!
- రైతు ఉద్యమం మరింత విస్తృతం
- రాజస్థాన్ నుంచి వస్తున్న రైతులు
- హైవేలపై అడ్డుగా కాంక్రీట్ దిమ్మెలు
- చర్చలు సాగుతాయన్న కేంద్రం
దాదాపు రెండు వారాలుగా రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ న్యూఢిల్లీలో నిరసనలను తెలిపేందుకు సరిహద్దుల వద్ద వేచి చూస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి తుది అల్టిమేట్టం జారీ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నరైతులు, అందుకు ఈ నెల 18వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించారు. ఈలోగా చట్టాలను రద్దు చేయకుంటే, 19 నుంచి రైతులంతా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని ప్రకటించారు.
ఇక తమ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమైన రైతు సంఘాల నేతలు, కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని, తొలుత ఈ చట్టాలని రద్దు చేస్తామని ప్రకటిస్తే, ఆపై మాత్రమే మిగతా అంశాలపై తాము చర్చిస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన రైతు నేత కన్వల్ ప్రీత్ సింగ్, రాజస్థాన్ నుంచి కూడా రైతులు రానున్నారని అన్నారు.
వేలాది మంది రైతులు షాజహాన్ పుర్ నుంచి ఢిల్లీ - జయపుర జాతీయ రహదారి మీదుగా యాత్రకు నేడు రానున్నారని అన్నారు. దేశవ్యాప్త నిరసనలకు కూడా పిలుపు నిచ్చామని, వాటిల్లో రైతు సంఘాల ప్రతినిధులంతా పాల్గొంటారని, నిరాహార దీక్షలకు దిగుతారని అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆయన, అది అసాధ్యమని, ఈ విషయం అతి త్వరలోనే కేంద్రానికి అవగతమవుతుందని అన్నారు.
ప్రస్తుతం రైతులు మాత్రమే నిరసనల్లో ఉన్నారని, వారి భార్యలు, కుమార్తెలు, ఇతర కుటుంబీకులు కూడా సంఘీభావంగా ఉద్యమంలోకి రానున్నారని, దీక్షా శిబిరాల్లోనే వారికి ఏర్పాట్లు చేయనున్నామని అన్నారు. ఇక ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఉద్యమం మరో మెట్టెక్కనుందని అన్నారు. ఇదిలావుండగా, ఢిల్లీ సరిహద్దుల్లో తమ ఆందోళనను ముమ్మరం చేయాలని రైతులు భావించిన నేపథ్యంలో పోలీసు బందోబస్తు పెరిగింది.
ఢిల్లీ సరిహద్దుల్లోని రహదారులపై కాంక్రీటు దిమ్మెలతో అడ్డుకట్టలు ఏర్పడ్డాయి. యమునా ఎక్స్ ప్రెస్ వేను దిగ్బంధించాలని రైతులు భావిస్తుండగా, ఆ రహదారిని కూడా అధికారులు ముందుగానే మూసేశారు. ఢిల్లీ - జయపుర నేషనల్ హైవేపై గస్తీని పెంచారు. అయితే, సోమవారం మరో విడత చర్చలను కేంద్రం ప్రారంభిస్తుందని, కేంద్రానికి, రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా వ్యాఖ్యానించారు.
ఇక రైతుల ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో గత 17 రోజుల్లో 11 మంది చనిపోవడం ఉద్రిక్తతలను పెంచుతోంది. ఎంతమంది రైతులు తమ ప్రాణాలను బలివ్వాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.