Toll plaza: ఏపీలో 57 శాతం ఫాస్టాగ్ యూజర్లు.. నెలాఖరు నాటికి 90 శాతం: ఎన్‌హెచ్ఏఐ

57 percent fastag users in Andhrapradesh

  • జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
  • టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విక్రయ కేంద్రాలు
  • నగదు చెల్లిస్తే రెట్టింపు ఫీజు

టోల్‌గేట్లలో ఫాస్టాగ్ వాడకాన్ని కేంద్రం ఇటీవల తప్పనిసరి చేసింది. ఈ మేరకు జనవరి 1 నుంచి నగదు చెల్లించే లైన్లను తొలగించనున్నారు. ఇకపై ఫాస్టాగ్ లేకుండా వాహనం ముందుకెళ్లడం కష్టమే. ఫాస్టాగ్ లేని వారికి రెట్టింపు ఫీజు వసూలు చేసే యోచన కూడా ఉంది. అంతేకాదు, ఇకపై ఫాస్టాగ్ ఉంటేనే రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో వాహన యజమానులు అప్రమత్తమవుతున్నారు. ఫాస్టాగ్‌కు త్వరగా మారుతున్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 57 శాతం మంది ఫాస్టాగ్ యూజర్లు ఉన్నట్టు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) లెక్కగట్టింది. టోల్‌గేట్ల ద్వారా ప్రస్తుతం 50 నుంచి 57 శాతం వాహనాలు ఫాస్టాగ్ మీదుగా వెళ్తున్నట్టు పేర్కొంది. ఈ నెలాఖరు నాటికి ఈ సంఖ్య 90 శాతానికి చేరుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్ స్టిక్కర్లను విక్రయించే కౌంటర్లు ఏర్పాటు చేసింది.

నిజానికి ఈ ఫాస్టాగ్ విధానాన్ని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 2014లోనే అమల్లోకి తీసుకొచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ)తో కూడిన ఈ ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనాలపై అతికిస్తే దానిపై ఉన్న బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్ఎఫ్ఐడీ యంత్రం రీడ్ చేస్తుంది. ఫలితంగా టోల్ ఫీజు ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. టోల్ ఫీజు కట్ అయినట్టు మొబైల్ నంబరుకు మెసేజ్ కూడా వస్తుంది.  జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న ‘వన్‌ నేషన్‌.. వన్‌ ట్యాగ్‌’ కింద ఈ ఫాస్టాగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. కనీసం వంద రూపాయలతో ఫాస్టాగ్ స్టిక్కర్‌ను పొందవచ్చు.

  • Loading...

More Telugu News