bacteria: బెడ్ రూంలో దుమ్ముధూళీలోని బ్యాక్టీరియాతో పిల్లల ఆరోగ్యానికి మంచిదేనంటోన్న పరిశోధకులు!
- తేల్చి చెప్పిన డెన్మార్క్ లోని పరిశోధకుల బృందం
- 577 మంది శిశువుల పడకల నుంచి దుమ్ము శాంపిళ్లను సేకరించి పరిశోధన
- 542 మంది పిల్లల శ్వాసకోశ నమూనాలు పరిశీలన
- భవిష్యత్తులో ఉబ్బసం, అలర్జీ వంటి ప్రమాదాలను తగ్గించటంలో మంచి ప్రభావం
బెడ్ రూంలో దుమ్ముదూళీ ఉంటే అది మన ఆరోగ్యానికి హాని చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, అందులోని సూక్ష్మజీవులు చిన్నారుల ఆరోగ్యానికి మంచి చేస్తాయని డెన్మార్క్ లోని పరిశోధకుల బృందం తేల్చింది. పరుపులపై ఉండే సూక్ష్మజీవులకు, చిన్నారుల శరీరంలోని బ్యాక్టీరియాకు మధ్య సంబంధం ఉందని పరిశోధకులు చెప్పారు.
పరుపులపై ఉండే సూక్ష్మజీవుల వల్ల పలుసార్లు వ్యాధుల ముప్పు పెరిగినట్లే, కొన్ని సార్లు మాత్రం కొన్ని రకాల జబ్బుల నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు. 577 మంది శిశువుల పడకల నుంచి దుమ్ము శాంపిళ్లను సేకరించి పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. ఇందుకోసం 542 మంది పిల్లల శ్వాసకోశ నమూనాలనూ పరిశీలించారు.
చిన్నారుల శరీరంలోని బ్యాక్టీరియా పరుపులపై ఉండే బ్యాక్టీరియాను ప్రభావితం చేస్తుందని చెప్పారు. దీంతో చిన్నారుల్లో భవిష్యత్తులో ఉబ్బసం, అలర్జీ వంటి ప్రమాదాలను తగ్గించటంలో మంచి ప్రభావం చూపుతోందని తెలిపారు. చిన్నారులు అన్ని రకాల సూక్ష్మజీవుల ప్రభావానికి లోనయినప్పుడే వారిలో వ్యాధి నిరోధకత శక్తి పెరుగుతుందని తెలిపారు.
వారు జబ్బులను తట్టుకోగలుగుతారని అన్నారు. మంచంపై ఉండే సూక్ష్మజీవులు ఇంట్లోని పరిసరాల ద్వారా ప్రభావితం అవుతాయని, ఇక్కడ అధిక బ్యాక్టీరియా వైవిధ్యం కారణంగా చిన్నారుల శరీరంలోకి అవి ప్రవేశించడంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.