Kamal Haasan: కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి అల్లాడుతుంటే రూ.1000 కోట్లతో పార్లమెంటు కడతారా?: కమల్ హాసన్
- నూతన పార్లమెంటు నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు
- సెంట్రల్ విస్టా పేరుతో భారీ పార్లమెంటు సముదాయం
- చైనాలో గ్రేట్ వాల్ కట్టేటప్పుడు వేలమంది చనిపోయారన్న కమల్
- ప్రజల రక్షణ కోసమే ఆ గోడ అని రాజులు చెప్పినట్టు ప్రస్తావన
- భారత పాలకులు అలాగే ఉన్నారని విమర్శలు
సెంట్రల్ విస్టా పేరుతో కేంద్రం నూతన పార్లమెంటు సముదాయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ధ్వజమెత్తారు. కరోనా దెబ్బకు దేశంలో సగం మంది ఉపాధి కోల్పోయి ఆకలితో అల్లాడుతుంటే, ఎవరైనా రూ.1000 కోట్లతో పార్లమెంటు భవనం కడతారా? అంటూ మండిపడ్డారు.
చైనాలో గ్రేట్ వాల్ నిర్మాణ సమయంలో వేలమంది ప్రజలు చనిపోయారని, అయితే ఆ గోడ నిర్మిస్తోంది ప్రజలను రక్షించడానికేనని అప్పటి రాజులు చెప్పారని కమల్ ప్రస్తావించారు. ఇప్పటి భారత పాలకుల తీరు కూడా అలాగే ఉందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దయచేసి తన వ్యాఖ్యలకు బదులివ్వాలని స్పష్టం చేశారు.