Leopard: గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో కుక్కను ఎత్తుకుపోయింది కుక్కే... చిరుతపులి కాదు!
- గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో చిరుత కలకలం
- రోడామిస్ట్రీ కాలేజిలో కుక్కను ఎత్తుకెళ్లిందంటూ ప్రచారం
- రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు
- గుట్టల వద్ద ట్రాప్ కెమెరాల ఏర్పాటు
- కెమెరాలకు చిక్కిన కుక్క
- చిరుత కాదని తేల్చిన అధికారులు
హైదరాబాదులోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో చిరుతపులి కలకలం రేగింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ఐటీ కారిడార్ లోని రోడా మిస్ట్రీ కాలేజీలోకి ఓ చిరుత ప్రవేశించడమే కాకుండా, అక్కడ తిరుగాడే ఓ కుక్కను ఎతుకెళ్లిందన్న వార్త స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఆ కాలేజీలో పనిచేసే ఓ మహిళ చిరుతపులి కుక్కను ఎత్తుకెళుతుండగా చూశానని చెప్పడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
కాలేజీ ఆవరణలో రక్తపు మరకలు కూడా ఉండడంతో చిరుత అయ్యుంటుందని భావించారు. ఒక్కసారి ఆహారం తింటే రెండు మూడు రోజుల వరకు అది బయటికి రాదన్న ఉద్దేశంతో కాలేజీ పక్కనే ఉన్న గుట్టల వద్ద ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే, ఆ గుట్టల్లోంచి ఓ కుక్క బయటికి రావడం ఆ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దాంతో కుక్కే మరో కుక్కను పొదల్లోకి ఎత్తుకెళ్లి ఉంటుందని అంచనాకొచ్చారు. చిరుత కాదని తేలడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.