Corona Virus: ఊపిరితిత్తుల కణజాలాన్ని కరోనా వైరస్ ఎలా దెబ్బతీస్తుందో గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు
- కరోనా సోకితే దెబ్బతింటున్న శ్వాస వ్యవస్థ
- ఊపిరితిత్తుల్లో విపరీతమైన డ్యామేజి
- బోస్టన్ వర్సిటీ పరిశోధకుల ఆసక్తికర అధ్యయనం
- మాస్ స్పెక్ట్రోమెట్రీ సాయంతో పరిశోధన
- మాలిక్యులర్ సెల్ లో వివరాలు ప్రచురణ
కరోనా వైరస్ సోకినవారిలో ప్రధానంగా శ్వాస వ్యవస్థ దెబ్బతింటున్న వైనం తెలిసిందే. అయితే కరోనా వైరస్ ఏవిధంగా ఊపిరితిత్తుల కణజాలాన్ని ధ్వంసం చేస్తుందో అమెరికా శాస్త్రవేత్తలు గుట్టు విప్పారు. కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన ఊపిరితిత్తుల్లో ఎలాంటి కణజాల శృంఖల చర్యలు జరుగుతాయో తెలుసుకున్నారు. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేపట్టిన దీనికి సంబంధించిన అధ్యయనాన్ని మాలిక్యులర్ సెల్ అనే జర్నల్ లో ప్రచురించారు.
శాంపిల్స్ లో ఉండే కణాల బయోడేటాను ఆమూలాగ్రం తెలుసుకోలిగే మాస్ స్పెక్ట్రోమెట్రీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల కణజాలంపై పరిశోధన చేపట్టారు. కరోనా వైరస్ సోకిన వెంటనే ఊపిరితిత్తుల్లోని కణాలకు చెందిన ప్రొటీన్లు ఎలాంటి మార్పులకు గురవుతాయో తెలుసుకున్నారు.
ఎంతో కీలకంగా భావించే ప్రొటీన్ మార్పిడి చర్య ఫాస్పోరైలేషన్ ప్రక్రియ... ఇన్ఫెక్షన్ కు గురైన ఊపిరితిత్తుల్లో అసహజంగా ఉన్నట్టు వెల్లడైంది. ప్రొటీన్లలో జరిగే ఫాస్పొరైలేషన్ క్రియ ఓ అవయవం యొక్క కణాల్లో ప్రొటీన్ చర్యల నియంత్రణకు ఉపయోగపడుతుంది. అయితే, కరోనా వైరస్ ఎంతో తెలివిగా వ్యవహరించి ఈ కణాల్లోని ఫాస్పోరైలేషన్ క్రియను ఒడిదుడుకులకు గురిచేస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల కణాలు గందరగోళానికి గురవుతాయి.
ఈ అసాధారణ చర్యలు వైరస్ కణాలు రెట్టింపవ్వడానికి ఉపకరిస్తాయని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో శరీర కణాలు నాశనం కావడంతో ఊపిరితిత్తుల్లో డ్యామేజి జరుగుతుంది. అంతేకాదు, వ్యాధి నిరోధక వ్యవస్థ తమపై దాడి చేస్తే ఈ వైరస్ కణాలు ఊపిరితిత్తుల కణాల వనరులను కవచంగా వాడుకుని తప్పించుకుంటాయి.
ఈ క్రమంలో కొత్త వైరస్ కణాలు ఏర్పడి ఊపిరితిత్తుల్లో నష్టం మరింత పెరుగుతుంది. ఆపై వైరస్ కణాలు ఊపిరితిత్తుల కణాలను వాటి స్వీయ వినాశానికి వదిలేసి వాటి నుంచి నిష్క్రమిస్తాయని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డారెల్ కోటాన్ తెలిపారు. తమ పరిశోధన ఆధారంగా ఊపిరితిత్తులపై కరోనా ప్రభావాన్ని తగ్గించే చికిత్స విధానాల రూపకల్పన సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.