Bandi Sanjay: కేసీఆర్ నోటిఫికేషన్ అనగానే సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం అన్నంత జోక్ గా భావిస్తున్నారు: బండి సంజయ్

 Bandi Sanjay reacts over CM KCR announcement on employment notifications

  • ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామన్న సీఎం కేసీఆర్
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమేనన్న బండి సంజయ్
  • ఓ ఎన్నికల డ్రామా అంటూ వ్యాఖ్యలు
  • సీఎం మాటలను ఎవరూ తీవ్రంగా తీసుకోవడంలేదని వెల్లడి
  • నిరుద్యోగుల కడుపుమంటలో కాలిపోతారంటూ ఆగ్రహం

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు త్వరలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ నోటిఫికేషన్ అనగానే సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం అన్నంత జోక్ గా నిరుద్యోగులు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మాటలను సీరియస్ గా తీసుకోవడం ప్రజలు ఎప్పుడో మానేశారని వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓట్ల కోసమే నోటిఫికేషన్ డ్రామాకు తెరలేపాడని ఆరోపించారు.  రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు ఉన్న గీరలు ఊడిపోక తప్పదని వ్యాఖ్యానించారు. ఇన్నిరోజులు ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ కు దుబ్బాక, జీహెచ్ఎంసీ దెబ్బతో సోయి వచ్చినట్టుందని బండి సంజయ్ వ్యంగ్యం ప్రదర్శించారు. బీజేపీ ఆందోళనకు దిగుతుందని ముందే పసిగట్టిన కేసీఆర్ భయపడి నోటిఫికేషన్ అని పేపర్ ప్రకటన చేశారని ఆరోపించారు. నిజంగా నిరుద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

నోటిఫికేషన్ తప్పుల తడకలుగా ఇచ్చి కోర్టుల ద్వారా నోటిఫికేషన్ రద్దు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తే నిరుద్యోగుల తడాఖా చూపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. నోటిఫికేషన్ ఒక బూటకమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇదో కొత్త నాటకం అని ఆరోపించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ దెబ్బతో దొరకి ఆరేళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు.

"నిరుద్యోగుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా నిన్ను క్షమించరు. మీ మాయల పకీరు మాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరేళ్లయింది... అప్పట్నించి ఇప్పటివరకు నిరుద్యోగులు గుర్తురాలేదా?" అని నిలదీశారు. నిరుద్యోగుల కడపుమంటలో కేసీఆర్ కాలిపోయే రోజులు వచ్చాయని, నియామకాల నోటిఫికేషన్ ఒక ఎన్నికల డ్రామా అని ఆరోపించారు.

  • Loading...

More Telugu News