Corona Virus: కరోనా టీకా వేయించుకోనున్న ట్రంప్!
- దేశవ్యాప్తంగా నేటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం
- తొలి విడతలో 30 లక్షల మందికి టీకా
- మూడు వారాల తర్వాత రెండో డోసు
అమెరికాలో నేడు కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మిచిగన్‌లోని ఫైజర్ కంపెనీ నుంచి ఇప్పటికే టీకాలతో కూడిన ట్రక్కులు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లు టీకా తీసుకోనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
వచ్చే పది రోజుల్లో శ్వేతసౌధ సిబ్బందితోపాటు ప్రభుత్వ అధికారులకు టీకా ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ట్రంప్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ, ఇప్పటికే వైరస్ బారినుంచి కోలుకున్న ఆయన టీకా తీసుకునేందుకు అంగీకరిస్తారా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.
అలాగే, వచ్చే నెలలో అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్‌లు కూడా వ్యాక్సిన్ తీసుకునే విషయంలో స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, తొలి విడతలో దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు. మూడు వారాల అనంతరం రెండో డోసు ఇస్తారు.