Prakash Javadekar: వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడంలో అశ్రద్ధ వహించకూడదు: జవదేకర్
- త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందన్న జవదేకర్
- వ్యాక్సిన్ కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం
- ఫిబ్రవరి కల్లా మన దేశంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం
కరోనాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. మన దేశంలో వ్యాక్సిన్ తయారీకి నడుం బిగించిన ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందే దశలో రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుందని... ఈ విషయంలో ఎవరూ అశ్రద్ధ వహించకూడదని చెప్పారు. అంతర్జాతీయ కరోనా వైరస్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వెంటనే పంపిణీ చేపట్టేందుకు రాష్ట్రాలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తుంటే ఫిబ్రవరి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.