Airtel: రైతు ఉద్యమాన్ని వేదికగా చేసుకుని ఎంఎన్‌పీకి పాల్పడుతున్నాయి: ఎయిర్‌టెల్, వీఐఎల్‌పై జియో సంచలన ఆరోపణ

Jio sensational comments on vodafone idea and airtel

  • ఆ రెండు సంస్థలు అనైతిక ఎంఎన్‌పీకి పాల్పడుతున్నాయి
  • చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌కు లేఖ
  • ప్రత్యర్థులు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తారని తమకు తెలుసన్న ఎయిర్‌టెల్

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని వేదికగా చేసుకుని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్), ఎయిర్‌టెల్ సంస్థలు మొబైల్ నంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ)కి పాల్పడుతున్నాయంటూ రిలయన్స్ జియో సంచలన ఆరోపణలు చేసింది. వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు లేఖ రాసింది.

రైతు ఉద్యమంలో ఈ రెండూ అనైతికంగా ఎంఎన్‌పీకి పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఎంఎన్‌పీ కోసం ఆ రెండు సంస్థలు తమ ఉద్యోగులు, ఏజెంట్లు, రిటైలర్లను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంది. జియో నుంచి తమ నెట్‌వర్క్‌లోకి మారాలని రైతులను ఒత్తిడి చేస్తున్నాయని, అలా చేస్తే ఉద్యమానికి మద్దతు పలికినట్టు అవుతుందంటూ అర్థరహిత వ్యాఖ్యలతో ఈ చర్యకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తింది. ఈ నెల 10న ట్రాయ్‌కు రాసిన ఈ లేఖకు కొన్ని ఫొటోలను కూడా జతచేసింది.

అయితే, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చేసిన ఆరోపణలను ఎయిర్‌టెల్ కొట్టిపడేసింది. ఆ ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని స్పష్టం చేసింది. తాము రెండున్నర దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నామని, తీవ్రమైన పోటీని ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపింది. అదే సమయంలో తమ వినియోగదారులకు నిరంతరం అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తూ వస్తున్నామని వివరించింది. తాము తమ ప్రత్యర్థులను కూడా ఎంతగానో గౌరవిస్తామని చెప్పడానికి తాము గర్వపడుతున్నట్టు భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. ప్రత్యర్థులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తారని తమకు తెలుసని, అయినప్పటికీ తాము ఎంతో పారదర్శకంగానే వ్యాపారం చేస్తామని వివరించింది.

  • Loading...

More Telugu News