INS Virat: 'విరాట్' మ్యూజియం లేనట్టే... యుద్ధనౌకను విరగ్గొట్టేస్తున్నారు!
- ప్రస్తుతం గుజరాత్ తీరంలో విరాట్ నౌక
- ఇప్పటికే విడిభాగాలు తీస్తున్న శ్రీరామ్ షిప్ బ్రేకర్స్
- వద్దని కేంద్రానికి విన్నవించిన శివసేన
భారత నౌకాదళానికి ఎన్నో ఏళ్లపాటు సేవలందించి, ప్రస్తుతం తీరానికే పరిమితమైన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ ను ఓ మ్యూజియంగా మార్చుతారని, భవిష్యత్ తరాలకు భారత వార్ షిప్ ల సత్తాను ప్రదర్శిస్తూ, ఇది సగర్వంగా నిలుస్తుందని భావిస్తూ వచ్చిన వారికి నిరాశే మిగలనుంది. విరాట్ తాజా చిత్రాలు కొన్ని విడుదలకాగా, ఇప్పటికే యుద్ధ నౌకను విరగ్గొట్టే పనులు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ షిప్ గుజరాత్ లోని అలాంగ్ తీరానికి సమీపంలో ఉంది. అలాంగ్ లోని శ్రీరామ్ షిప్ బ్రేకర్స్ సంస్థ అధీనంలో ఇది ఉండగా, ఎన్విటెక్ అనే మేరీటైమ్ కన్సల్టెన్సీ సంస్థ రూ.110 కోట్లు పెట్టి కొనాలని భావించింది. అయితే, ఈ షిప్ ను పూర్తిగా విడగొట్టాలనే నిర్ణయానికి వచ్చి, ఇప్పటికే ముందు భాగంలోని ఒక్కో ముక్కనూ తొలగిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, ఈ షిప్ ను విడగొట్టవచ్చని కేంద్ర రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం జారీ అయిన తరువాతనే, డిస్ మాంటిల్ పనులను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ షిప్ ను తమ తమ రాష్ట్రాల తీరాల్లో నిలిపి, ఓ మ్యూజియంగా ఉంచాలని పలు రాష్ట్రాలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తో పాటు, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు సైతం ఇందుకోసం తమ ఆసక్తిని వెలువరించాయి. అయినా, దీన్ని విడగొట్టే పనులు ప్రారంభం కావడం గమనార్హం.
సోమవారం నాడు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, రక్షణ శాఖకు ఓ లేఖను రాస్తూ, తమ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నౌకను తిరిగి నిలిపేందుకు సంపూర్ణ సహకారం అందిస్తుందని, వెంటనే విడగొట్టే పనులను నిలిపి దీన్ని మ్యూజియంగా ఉంచేందుకు అంగీకరించాలని లేఖను రాశారు.