Joe Biden: జో బైడెన్ అధ్యక్షుడు... తేల్చేసిన ఎలక్టోరల్!
- అందరు అమెరికన్లకూ నేనే అధ్యక్షుడిని
- ఎలక్టోరల్ కాలేజ్ సమావేశం తరువాత బైడెన్ వ్యాఖ్య
- రాజీనామా చేసిన అటార్నీ జనరల్ బిల్ బ్రార్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పదేపదే ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు చివరి అవకాశం కూడా దూరమైంది. నిన్న సమావేశమైన ఎలక్టోరల్ కాలేజ్, జో బైడెన్ ను అధ్యక్షునిగా ఎన్నుకుంది. దీంతో తదుపరి అమెరికా అధ్యక్షుడు ఆయనేనని తేలిపోయింది. ఎలక్టోరల్ కాలేజ్ సమావేశం తరువాత బైడెన్ స్పందిస్తూ, "పుస్తకంలోని పేజీని తిప్పాల్సిన సమయం వచ్చింది" అని అన్నారు. ఎలక్టోరల్ కాలేజ్ సమావేశం తరువాత, బైడెన్ కు మెజారిటీ నిమిత్తం కావాల్సిన 270 ఓట్ల కన్నా అధిక ఓట్లు వచ్చాయని పేర్కొంది. ఆపై బైడెన్ స్పందిస్తూ, "అందరు అమెరికన్లకూ నేను అధ్యక్షుడిని" అని వ్యాఖ్యానించారు.
దీంతో జనవరి 20న ఆయన బాధ్యతలు చేపట్టేందుకు ఉన్న అన్ని అవాంతరాలూ తొలగినట్లయింది. ఇప్పటికే ఎన్నికల్లో అక్రమాలంటూ ట్రంప్ వేసిన అన్ని కేసులూ కొట్టివేయబడిన సంగతి తెలిసిందే. కాగా, నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపించిన అటార్నీ జనరల్ బిల్ బ్రార్ వచ్చే వారంలో తన పదవిని వీడనుండటం ఖరారైంది. ఈ నేపథ్యంలో "మన సంబంధం చాలా బలీయమైనది" అని ట్రంప్ ట్వీట్ చేశారు. "క్రిస్మస్ పర్వదినాలను తన కుటుంబంతో జరిపే అవకాశం బ్రార్ కు లభించింది" అని ట్రంప్ అన్నారు.
ఇక అమెరికాలో తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు జో బైడెన్ కు ఉన్న అన్ని అవాంతరాలూ తొలగినట్లు కాగా, ట్రంప్ బైడెన్ కు గౌరవప్రదంగా బాధ్యతలు అప్పగించాల్సిందేనని, మొండికేస్తే కోర్టు కేసులు, కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.