Mark Zuckerberg: ఫేస్ బుక్ ఇండియా సదస్సులో మార్క్ జుకర్ బర్గ్, ముఖేశ్ అంబానీ మధ్య ఆసక్తికర చర్చ

Mark Zuckerberg and Mukesh Amabani at Facebook Fuel for India summit

  • గత వేసవిలో జియో ప్లాట్ ఫామ్స్ లో ఫేస్ బుక్ పెట్టుబడులు
  • ఫేస్ బుక్ ఇండియా సదస్సులో పాల్గొన్న జుకర్ బర్గ్, అంబానీ
  • చిరువ్యాపారాలకు ప్రోద్బలంపై చర్చ
  • డిజిటల్ భారతావనికి ఫేస్ బుక్ ముఖచిత్రమన్న అంబానీ
  • చిన్నవ్యాపారాలకు మద్దతు తమకెంతో ముఖ్యమన్న జుకర్ బర్గ్

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఏర్పాటు చేసిన ఫేస్ బుక్ ఫ్యూయెల్ ఫర్ ఇండియా-2020 సదస్సులో సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తో పాటు భారత అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు భవిష్యత్ ప్రణాళికలపైనా, వర్తమాన వ్యవహారాలపైనా చర్చించుకున్నారు.

ప్రజల స్థాయిని పెంచడంలో డిజిటల్ కనెక్టివిటీ ప్రాముఖ్యత, చిన్నతరహా వ్యాపారాలకు మరింత ప్రోద్బలాన్నిచ్చే సరైన సాంకేతికత, సాధనాలు అందుబాటులోకి తేవడంపై ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకున్నారు. పారిశ్రామిక ప్రస్థానానికి, భారత డిజిటల్ మిషన్ కు జియో-ఫేస్ బుక్ ల భాగస్వామ్యం ఏవిధంగా ఉపయోగపడుతుందన్న అంశం కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది.

ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, ఫేస్ బుక్ డిజిటల్ భారతావనికి ముఖచిత్రంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచాన్ని డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానం చేయడంలో మార్క్ జుకర్ బర్గ్ నిజమైన నిర్మాణకర్తలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.

ఇక మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడమే తమ కార్యాచరణ వెనుకున్న ముఖ్య ఉద్దేశమని, అందుకోసం అనేక సాధనాలు అందుబాటులోకి తెస్తున్నామని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 60 మిలియన్ల చిరువ్యాపారాలు, వాటి ద్వారా లభించే మిలియన్ల కొద్దీ ఉద్యోగాలపై తాము దృష్టి సారించామని చెప్పారు. జియోతో తమ భాగస్వామ్యం అందుకోసమేనని తెలిపారు. కరోనా దెబ్బకు కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడంలో భారత్ లోని చిరువ్యాపారాలు ఎంతో కీలకభాగం అని జుకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనతో అంబానీ ఏకీభవించారు.

కొవిడ్ సంక్షోభం సరికొత్త అభివృద్ధికి ద్వారాలు తెరిచిందని పేర్కొన్నారు. గత వేసవిలో రిలయన్స్ కు చెందిన జియో ప్లాట్ ఫామ్స్ లో ఫేస్ బుక్ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడంతో దిగ్గజ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. వాట్సాప్, వాట్సాప్ ఫర్ బిజినెస్, వాట్సాప్ పే, జియో మార్ట్ వంటి విభాగాలకు ఈ ఒప్పందం చేయూతగా నిలుస్తుందని ఫేస్ బుక్, రిలయన్స్ భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News