Bapu: వెండితెర చిత్రకారుడు బాపు జయంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ నివాళులు
- తెలుగుదనపు ఆహ్లాదాన్ని చిత్రీకరించారన్న చంద్రబాబు
- బాపుగా చిరకీర్తి పొందారని వెల్లడి
- సాటిలేని ప్రతిభావంతుడన్న లోకేశ్
- సినీ దర్శకుడిగా సొంత శైలి సంపాదించుకున్నారని వ్యాఖ్యలు
చేయి తిరిగిన చిత్రకారుడు, వెండితెర దర్శకుడు బాపు జయంతి సందర్భంగా టీడీపీ అధినాయకత్వం స్పందించింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వెండితెర చిత్రకారుడు బాపుకు నివాళులు అర్పించారు. అటు వెండితెరపైనా, ఇటు కాన్వాసు పైనా తెలుగుదనపు ఆహ్లాదాన్ని, సంస్కృతిని, చమత్కారాన్ని మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారంటూ బాపును చంద్రబాబు కీర్తించారు. బాపుగా చిరకీర్తి పొందిన సత్తిరాజు వెంకటలక్ష్మీనారాయణ గారి జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నానని వెల్లడించారు.
నారా లోకేశ్ స్పందిస్తూ... సాటిలేని ప్రతిభకు నిరాడంబరత తోడైతే అది బాపు గారని కొనియాడారు. చిత్రకారుడిగా, సినీ దర్శకుడిగా తనకంటూ ఒక శైలిని సృష్టించుకుని, తెలుగువాళ్లు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమాలు అందించారంటూ కీర్తించారు. ఇవాళ పద్మశ్రీ బాపు గారి జయంతి సందర్భంగా ఆ ప్రతిభాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.