India: ఇండియాలో ఆరో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి!
- బయోటెక్నాలజీ విభాగం సహకారంతో జెనోవా తయారీ
- ఫైజర్ వ్యాక్సిన్ తయారైన విధానంలోనే టీకా
- వెల్లడించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్
ఇండియాలో ఇప్పటివరకూ ఐదు కరోనా టీకాలకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా, మరో వ్యాక్సిన్ క్యాండిడేట్ కు అనుమతి ఇచ్చినట్టు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. భారత ప్రభుత్వ బయో టెక్నాలజీ విభాగం సహకారంతో జెనోవా తయారు చేసిన టీకా ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతినిచ్చిందని మీడియాకు తెలిపారు. ఫైజర్ వ్యాక్సిన్ తయారైన సాంకేతిక పద్ధతుల్లోనే ఈ వ్యాక్సిన్ కూడా తయారైందని వీకే పాల్ వ్యాఖ్యానించారు.
"అయితే, ఈ వ్యాక్సిన్ ను ఫైజర్ లేదా మరికొన్ని వ్యాక్సిన్ల మాదిరిగా అతి శీతల వాతావరణంలో నిల్వ చేయనవసరం లేదు. సాధారణ చలి పరిస్థితుల్లో... అంటే ఇళ్లల్లో ఉండే ఫ్రిజ్ లలోనే నిల్వ చేసుకోవచ్చు" అని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ భారీ ఎత్తున జరగనున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఒకే ప్రాంతంలో భారీ ఎత్తున చేరిన రైతులు నిరసన తెలియజేస్తుండటంతో కరోనా మహమ్మారి మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన వీకే పాల్, ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, రైతులు అన్ని జాగ్రత్తలు పాటించేలా చూడాలని అన్నారు. ప్రజాస్వామ్యం కొనసాగడం ఎంత ముఖ్యమో, కొవిడ్-19 గైడ్ లైన్స్ ను పాటించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.
ఇప్పుడిప్పుడే కరోనా కేసులు ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్నాయని, ఈ నిరసనల వల్ల కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని ఆయన హెచ్చరించారు. కరోనా కేసులను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, అవన్నీ విఫలం కాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉందని అన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేలా చూడాల్సిన బాధ్యత ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై ఉందని ఆయన అన్నారు.
ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ప్రపంచ దేశాల జనాభా, కరోనా కేసుల నిష్పత్తితో పోలిస్తే, ఇండియాలోనే కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. "29 వేల కోల్డ్ చెయిన్ పాయింట్లు, 240 వాక్ ఇన్ కూలర్లు, 70 వాకిన్ ఫ్రీజర్స్, 45 వేల ఐస్ లించ్డ్ రిఫ్రిజిరేటర్లు, 41 వేల డీప్ ఫ్రీజర్లు, 300 సోలార్ రిఫ్రిజిరేటర్లను సిద్ధం చేశాం. వాటన్నింటినీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ పంపించాం" అని తెలిపారు.