Kabul: కారుకు ఐఈడీ బాంబు పెట్టి, కాబూల్ డిప్యూటీ గవర్నర్ ను హత్య చేసిన దుండగులు!
- విధుల నిమిత్తం వెళుతున్న మహబూబుల్లా మెహేబినీ
- అతని కారుకు ముందే బాంబు అమర్చి పేలుడు
- కారులోని సహాయకుడు కూడా మృతి
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లో జరిగిన భారీ పేలుడు డిప్యూటీ గవర్నర్ మహబూబుల్లా మొహేబిని బలిగొంది. ఆయన ప్రయాణిస్తున్న కారుకు గుర్తు తెలియని వ్యక్తులు ఐఈడీ బాంబును అమర్చి, దాన్ని పేల్చారు. ఈ ప్రమాదంలో ఆయన సహచరుడు కూడా మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. తన సెక్యూరిటీ గార్డులతో కలిసి ఆయన విధుల నిమిత్తం వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. ఆయన్ను హత్య చేసింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద, తాలిబాన్ సంస్థా ప్రకటించలేదు.
గత సెప్టెంబర్ లో ఆఫ్గన్ ప్రభుత్వం, తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన తరువాత దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాబూల్ పరిధిలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, మత పెద్దలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గత వారం జలాలాబాద్ లో ఓ మహిళా న్యూస్ యాంకర్ ను కాల్చి చంపారు.
ఈ నెలలో నగరంపై రెండు సార్లు రాకెట్ దాడులు జరిగాయి. విద్యా సంస్థలు, యూనివర్శిటీ క్యాంపస్ లలోకి జొరబడిన సాయుధులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఇదిలావుండగా, కాబూల్ లోనే మంగళవారం జరిగిన మరో దాడిలో ఓ పోలీసు అధికారి మరణించగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో శాంతి చర్చలను జనవరి వరకూ వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దోహాలో ఈ చర్చలు జరుగుతుండగా, చర్చల వేదికను ఆఫ్గన్ కు మార్చాలని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, పలువురు సీనియర్ అధికారులు యోచిస్తున్నారు.