Anitha: కేసీఆర్ కు హ్యాట్సాఫ్ చెప్పిన జగన్... కడప ఘటనపై సైలెంట్ గా ఉన్నారు: అనిత
- దళిత మహిళపై జరిగిన హత్యాచార ఘటనపై జగన్ మౌనం వీడాలి
- ఇంట్లో ఉన్న ఆడవారికి కూడా రక్షణ లేకుండా పోయింది
- 19న ఛలో పులివెందులకు పిలుపునిస్తున్నాం
కడప జిల్లాలో దళిత మహిళపై జరిగిన హత్యాచారంపై ఏపీ ముఖ్యమంత్రి మౌనం వీడాలని టీడీపీ నాయకురాలు అనిత అన్నారు. దిశ ఘటనకు సంబంధించి ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హ్యాట్సాఫ్ అని జగన్ అన్నారని... ఇప్పుడు సొంత జిల్లాలో జరిగిన దారుణంపై మాట్లాడటం లేదని మండిపడ్డారు.
ఈ అంశానికి సంబంధించి రీపోస్టుమార్టం, పునర్విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఉన్న ఆడవారికి కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 19న తిరుపతి నుంచి ఛలో పులివెందులకు పిలుపునిస్తున్నామని చెప్పారు.
కడప జిల్లా లింగాల మండలం పెద్ద కూడాల గ్రామ శివార్లలో వివాహితను ఇటీవల దారుణంగా హత్య చేశారు. అత్యాచారం చేసి, ఆపై హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వైయస్ కుటుంబాన్ని కలిసి తన సోదరి హత్య కేసు విషయాన్ని చెప్పామని మృతురాలి సోదరుడు శ్రీనివాసులు తెలిపారు.