Bandi Sanjay: 24 గంటల్లో కేసీఆర్, డీజీపీ స్పందించాలి.. లేకపోతే ఉద్యమం తప్పదు: బండి సంజయ్
- కాళీమాత ఆలయ భూముల కబ్జాపై 24 గంటల్లో స్పందించాలి
- కబ్జాకు సహకరించిన డీసీపీని సస్పెండ్ చేయాలి
- మా సహనం నశిస్తే ఏమవుతుందో పోలీసులు ఆలోచించుకోవాలి
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని కాళీమాత ఆలయ భూములు కబ్జాకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఈ అంశంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు డెడ్ లైన్ విధించారు. భూకబ్జాపై కేసీఆర్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి 24 గంటల్లోగా స్పందించాలని, లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పాతబస్తీలో తాము చేపట్టబోయే ఉద్యమానికి కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
కాళీమాత భూముల కబ్జాకు సహకరించిన డీసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన మహిళలపై డీసీపీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఎంఐఎంకు డీసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాషాయ వస్త్రాలను ధరించినంత మాత్రాన కేసీఆర్ హిందువు కాలేరని చెప్పారు. హిందువో, బొందువో అనేది కేసీఆరే తేల్చుకోవాలని అన్నారు. తమ సహనం నశిస్తే పాతబస్తీ ఏమవుతుందో పోలీసులు ఆలోచించుకోవాలని చెప్పారు. మరోపక్క, ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.