Online loan: ఆన్‌లైన్ అప్పుకు మరొకరు బలి.. రుణసంస్థ దాష్టీకానికి ప్రభుత్వ అధికారి ఆత్మహత్య

AEO suicide after not able to pay online loan

  • వ్యాపారంలో నష్టపోయిన తండ్రి
  • కుటుంబ అవసరాల కోసం ‘స్నాప్ ఇట్ లోన్’ యాప్‌లో రుణం
  • రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ అందరికీ మెసేజ్‌లు పంపిన రుణ సంస్థ
  • మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువతి

వ్యాపారంలో నష్టపోయిన తండ్రి కష్టాలు చూడలేక ఆన్‌లైన్ యాప్‌లో రుణం తీసుకున్న ఓ యువతి గడువులోగా అప్పును తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో రుణ సంస్థ నుంచి వేధింపులు, ఒత్తిడి ఎక్కువయ్యాయి. తట్టుకోలేకపోయిన ఆమె పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో జరిగిందీ ఘటన.

 పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కిర్ని మౌనిక (24) ఖాత క్లస్టర్ పరిధిలో ఏఈవోగా పనిచేస్తోంది. ప్రస్తుతం వీరి కుటుంబం సిద్ధపేటలో ఉంటోంది. మౌనిక తండ్రి భూపాణి వ్యాపార ప్రయత్నాల్లో డబ్బులు నష్టపోయారు. దీంతో కుటుంబ అవసరాల కోసం ‘స్నాప్ ఇట్ లోన్’ యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ. 3 లక్షల రుణం తీసుకుంది.

అయితే, గడువు తీరినా ఆమె తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో యాప్ నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతటితో ఆగక ఆమె ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ మౌనికను రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించారు. రుణ సంస్థ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున మౌనిక మృతి చెందింది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News