kailash vijayvargiya: కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూలదోసింది మోదీయే: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
- ఇండోర్ కిసాన్ సమ్మేళన్లో విజయ్ వర్గీయ సంచలన వ్యాఖ్యలు
- ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్న కైలాశ్
- కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చింది ధర్మేంధ్ర ప్రధాన్ కాదన్న వర్గీయ
మధ్యప్రదేశ్లోని కమల్నాథ్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూల్చడంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక పాత్ర పోషించారని బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్చార్జ్ కూడా అయిన ఆయన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన కిసాన్ సమ్మేళన్లో చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఎవరైనా ప్రముఖ పాత్ర పోషించారంటే, అది ఒక్క మోదీయేనని, ధర్మేంద్ర ప్రధాన్ కాదని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని తాను ఇప్పటి వరకు ఎవరితోనూ చెప్పలేదని, ఈ వేదిక ద్వారానే తొలిసారి చెబుతున్నానన్న కైలాశ్.. మీరు కూడా ఎవరితోనూ చెప్పవద్దని సూచించడం గమనార్హం. కాగా, ఈ సమావేశానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా హాజరు కావడం గమనార్హం.
విజయ్ వర్గీయ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ప్రధాని మోదీ రాజ్యాంగ విరుద్ధంగా కూల్చుతున్న విషయం ఇప్పటికి స్పష్టమైందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా విమర్శించారు. కాంగ్రెస్ అంతర్గత సమస్యల వల్లే కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోయిందని బీజేపీ ఇప్పటి వరకు చెప్పుకొచ్చిందని, కానీ ఇప్పుడు నిజమేంటో ఆ పార్టీ నిజస్వరూపం ఏమిటో తేటతెల్లమైందని అన్నారు.