Amaravati: ఇంటికొక పోలీసును పెడుతున్నారు.. జగన్ కు ఎందుకంత భయం?: అమరావతి రైతులు
- జనభేరి సభకు వెళ్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు
- శాంతిభద్రతలకు పోలీసులే విఘాతం కల్పిస్తున్నారన్న రైతులు
- వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్య
అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వారు జనభేరి సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సభకు హాజరవుతున్న నేతలను కూడా ఆపేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ ను కూడా దాదాపు గంటసేపు ఆపేయడం ఉద్రిక్తతను పెంచింది. అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి అక్కడి నుంచి చంద్రబాబు నడుచుకుంటూనే వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై అమరావతి రైతులు మండిపడ్డారు.
తామేమైనా పాకిస్థాన్ పై యుద్ధానికి వెళ్తున్నామా? అని రైతులు మండిపడ్డారు. తమను చూసి జగన్ ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. శాంతియుతంగా జరగాల్సిన మహాధర్నాను పోలీసులే భగ్నం చేస్తున్నారని... పోలీసులే శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని నిప్పులు చెరిగారు.