TRP Scam: రిపబ్లిక్ టీవీ టీఆర్పీ రేటింగ్ స్కామ్.. బార్క్ మాజీ సీవోవో అరెస్ట్
- సంచలనం సృష్టించిన టీఆర్‌పీ కుంభకోణం
- కుంభకోణంతో బార్క్ మాజీ సీవోవో రోమిల్‌కు సంబంధాలు
- ఈ కేసులో ఇప్పటి వరకు 14 మంది అరెస్ట్
రిపబ్లిక్ టీవీ టీఆర్పీ రేటింగ్ కుంభకోణంలో ముంబై పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు పెరిగింది. ఈ కేసుతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీవోవో రోమిల్ రామ్‌గరియాను నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. టీఆర్‌పీల విషయంలో కొన్ని చానళ్లు అక్రమాలకు పాల్పడుతున్నట్టు బార్క్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
తమ చానల్ రేటింగును పెంచుకోవడం కోసం రిపబ్లిక్ టీవీ భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తేలింది. నిత్యం తమ టీవీని వీక్షించేలా కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందుకు కోసం నెలకు ఐదారువందల రూపాయలు చెల్లిస్తున్న విషయం వెలుగుచూసింది. దీంతో ఈ కేసులో మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. అదే చానల్‌కు చెందిన నెట్‌వర్క్ సీఈవో వికాస్‌ను ఆదివారం అరెస్ట్ చేయగా, బుధవారం బెయిలుపై విడుదలయ్యారు.