online loans: ఉసురు తీస్తున్న ఆన్‌లైన్ అప్పులు.. మొన్న ప్రభుత్వ ఉద్యోగి, నిన్న యువ ఇంజినీరు ఆత్మహత్య
- మొన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మౌనిక
- లాక్‌డౌన్ కారణంగా రుణాలు చెల్లించలేకపోయిన సునీల్
- వాట్సాప్ సందేశాల ద్వారా అతడి స్నేహితులకు మెసేజ్‌లు
అవసరాలకు ఆన్‌లైన్‌లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఏఈవోగా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని మౌనిక (24) మొన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, నిన్న హైదరాబాద్‌లో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సునీల్ (29) గత కొంతకాలంగా రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న సునీల్.. లాక్‌డౌన్ ఇబ్బందుల కారణంగా ఇటీవల రుణాలు తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో రుణదాతలు అధిక వడ్డీలు వేస్తూ చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చారు.
అక్కడితో ఆగక అతడి సెల్‌లోని కాంటాక్ట్‌లకు వాట్సాప్ సందేశాలు పంపి వేధించడం మొదలుపెట్టారు. దీనిని అవమానంగా భావించిన సునీల్ బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.