Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ... నిన్న 34 వేలు దాటిన భక్తుల సంఖ్య!
- హుండీ ద్వారా రూ. 2.61 కోట్ల ఆదాయం
- శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 18 వేల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు
- రూ.10 వేలు చెల్లిస్తే దర్శనాలకు ఏర్పాట్లు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం నాడు 34,822 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 2.61 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇదే సమయంలో 12,791 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. వచ్చే వారంలో రానున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25న 1000, జనవరి 1న 1000, మిగతా రోజుల్లో 2 వేల చొప్పున మొత్తం 18 వేల టికెట్లను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ. 10 వేలు విరాళం ఇచ్చే వారికి రిజర్వ్ చేశామని అధికారులు వెల్లడించారు.
ఇక ప్రొటోకాల్ అధికారులు, వైకుంఠ ద్వారాలను తెరచివుంచే పది రోజుల్లో స్వయంగా వస్తేనే టికెట్లను జారీ చేస్తామని, సిఫార్సు లేఖలన్నింటినీ రద్దు చేశామని అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనాల సందర్భంగా ఇప్పటికే 2 లక్షల టోకెన్లను రూ. 300 ప్రత్యేక దర్శనం ధరపై జారీ చేశామన్నారు.