Kangana Ranaut: నటి కంగన ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేయాలంటూ పిటిషన్.. కుదరదన్న ‘మహా’ సర్కారు

  Maharashtra govt opposes plea seeking removal of Kangana Twitter account

  • కంగన తన ట్వీట్లతో రెచ్చగొడుతున్నారంటూ పిటిషన్
  • ఆమె ఖాతాను రద్దు చేసేలా ట్విట్టర్‌కు ఆదేశాలివ్వాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన న్యాయవాది
  • పిటిషన్ అస్పష్టంగా ఉందని, కొట్టివేయాలని కోరిన ప్రభుత్వం

ట్వీట్ల ద్వారా దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బాలీవుడ్ నటి కంగన ప్రయత్నిస్తున్నారని, ఆమె ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై మహారాష్ట్ర సర్కారు స్పందించింది. కంగన ట్విట్టర్ ఖాతాను రద్దు చేయడం కుదరదని బాంబే హైకోర్టుకు తేల్చి చెప్పింది.

తన ట్వీట్లతో విద్వేషాలు రెచ్చగొడుతున్న కంగన ట్విట్టర్ ఖాతాను రద్దు చేసేలా ట్విట్టర్‌కు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ బాంబే హైకోర్టులో నిన్న క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కంగన, ఆమె సోదరి రంగోలి చందేల్ చేసిన ట్వీట్లను ఉదాహరించారు. సమాజంలోని ఓ వర్గాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోనూ పోల్చారని గుర్తు చేశారు.

జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. దేశ్‌ముఖ్ పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది వైపీ యాగ్నిక్ తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వాదనలను వ్యతిరేకించారు. అస్పష్టంగా ఉన్న ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

కంగన ట్వీట్లు ప్రజలను ఎలా ప్రభావం చేశాయో పిటిషనర్ వివరించలేదన్నారు. పిటిషన్ అస్పష్టంగా ఉందని, ట్విట్టర్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ అని పేర్కొన్నారు. ఇలాంటి అస్పష్టమైన పిటిషన్‌తో ఉపశమనం పొందడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కాబట్టి పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News