sajjala ramakrishna reddy: అప్పట్లో జగన్, కేసీఆర్ చేసినట్లు ఇప్పుడు చంద్రబాబు కూడా చేయాలి: సజ్జల సవాలు
- రెఫరెండానికి రెడీనా అని చంద్రబాబుగారు అడుగుతున్నారు
- నమ్మకమున్న నాయకులు ఏంచేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం
- చంద్రబాబుగారు కూడా టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలి
- ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది
అమరావతి రాజధానికి మద్దతుగా నిన్న నిర్వహించిన జనభేరిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సీఎం జగన్‌కు ఓ సవాలు విసిరిన విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా ఉంచాలని, లేదంటే మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలని, ఇందుకు జగన్ సిద్ధమేనా? అని నిన్న చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా వస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ విసిరారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.
‘రెఫరెండానికి రెడీనా అని చంద్రబాబుగారు అడుగుతున్నారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు ఏం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏం చేశారో మనకు తెలిసిందే’ అని సజ్జల చెప్పారు.
‘వారి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల ముందుకు వెళ్లారు. వైఎస్ జగన్ గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెబుతోన్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా?’ అని సజ్జల నిలదీశారు.