Chandrababu: పెన్నానదిలో ఏడుగురు యువకులు నీట మునిగిన ఘటనపై చంద్రబాబు, లోకేశ్ స్పందన
- కడప జిల్లా సిద్ధవటం వద్ద విషాద ఘటన
- ఈత కోసం నదిలో దిగిన యువకుల గల్లంతు
- ఎంతో బాధాకరమన్న చంద్రబాబు, లోకేశ్
- తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతమన్న చంద్రబాబు
- ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్
కడప జిల్లా సిద్ధవటం వద్ద పెన్నానదిలో ఏడుగురు యువకులు నీట మునిగిన ఘటన తీవ్ర విషాదాంతం అయింది. ఇప్పటివరకు 6 మృతదేహాలను వెలికితీయగా, మరొకరి కోసం గాలింపు జరుగుతోంది. స్నేహితుడి తండ్రి సంవత్సరీకం కార్యక్రమాల కోసం తిరుపతి నుంచి సిద్ధవటం దిగువపేటకు వచ్చిన యువకులు సరదాగా ఈత కోసం పెన్నా నదిలో దిగి గల్లంతయ్యారు. మొత్తం ఎనిమిది మంది నదిలో దిగగా, ఒక్కరు తప్ప అందరూ నీట మునిగారు. ఒక్కసారే అంతమంది యువకులు మృత్యువాత పడడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు.
కడప జిల్లా సిద్ధవటం వద్ద పెన్నానదిలో ఏడుగురు యువకులు నీటమునిగిన ఘటన ఎంతో బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణానికి గురైతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతం అని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు. పెన్నానది ప్రమాదంలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, పరిహారం ఇవ్వాలని, యువకుల మృతదేహాలను వీలైనంత త్వరగా బంధువులకు అప్పచెప్పాలని కోరారు.
అలా చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది: లోకేశ్
పెన్నానదిలో ఏడుగురు యువకులు గల్లంతైన ఘటన చాలా బాధ కలిగించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉన్నచోట ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడమో, తగిన భద్రత కల్పించడమో చేయాలని పేర్కొన్నారు. కానీ అలా చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
పాలకులకు నదుల్లో ఇసుకను ఇష్టానుసారం తవ్వేసుకుని సొమ్ము చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ... ఈ నదుల్లో స్నానాలకు వచ్చే ప్రజల ప్రాణాల మీద లేదని లోకేశ్ విమర్శించారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను పోగొట్టుకున్న ఆ కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.