BJP: రాష్ట్రంలో ఇతర పార్టీలు పోటీలు పడి ఖాళీ అవుతున్నాయి: బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు
- ఇటీవలి విజయాలతో బీజేపీలో ఉత్సాహం
- ఇతర పార్టీల నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు
- కంటోన్మెంట్, మలక్ పేట్ నేతల చేరిక
- కాంగ్రెస్ ను ఇక మ్యూజియంలోనే చూడొచ్చని వ్యంగ్యం
ఇటీవల దుబ్బాక, జీహెచ్ంఎసీ ఎన్నికల్లో లభించిన విజయాలతో తెలంగాణ బీజేపీ కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఇదే అదునుగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది. తాజాగా బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి.
కంటోన్మెంట్, మలక్ పేట నియోజకవర్గాలకు చెందిన అనేక పార్టీల నేతలు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ... ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవాళ బీజేపీలో భారీగా చేరికల సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ కు దీటైన పార్టీ తమదేనని ప్రజలు గుర్తించారని వెల్లడించారు. ఇతర పార్టీలు పోటీలు పడి ఖాళీ అవుతున్నాయని, గాంధీభవన్ పరిస్థితి కూడా అంతేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మ్యూజియంలోనే కనిపించే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.