India: అడిలైడ్ టెస్టు: విజృంభించిన భారత బౌలర్లు... ఆసీస్ 191 ఆలౌట్
- అడిలైడ్ లో భారత్, ఆస్ట్రేలియా మొదటి టెస్టు
- రాణించిన అశ్విన్, ఉమేశ్, బుమ్రా
- ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్ ఒంటరిపోరాటం
- భారత్ కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
- రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ సేన
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న అడిలైడ్ పిచ్ పై రవిచంద్రన్ అశ్విన్ 4, ఉమేశ్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లతో ఆతిథ్య ఆసీస్ పనిబట్టారు. దాంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్ కు కీలకమైన 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ ఉదయం సెషన్ లో ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభం కాగా, ఆద్యంతం టీమిండియా బౌలర్ల హవా కొనసాగింది. కెప్టెన్ టిమ్ పైన్ తప్ప భారత బౌలర్లను సాధికారికంగా ఎదుర్కొన్న ఆసీస్ ఆటగాడే కనిపించలేదు. ఓవైపు వికెట్లు పడుతున్నా పైన్ ఒంటరిపోరాటం చేసి 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. లబుషేన్ చచ్చీచెడీ 47 పరుగులు చేసినా అందులో రెండు క్యాచ్ డ్రాప్ లు ఉన్నాయి.
కీలక ఆటగాళ్లయిన స్టీవ్ స్మిత్ (1), ట్రావిస్ హెడ్ (7) విఫలం కావడంతో ఆసీస్ కు ఆశించిన స్కోరు సాధ్యం కాలేదు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. పృథ్వీ షా తన పరమచెత్త ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. 4 పరుగులు చేసిన షా... పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 62 పరుగులకు చేరగా, ఆటకు మరో మూడ్రోజుల సమయం మిగిలుండడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ కు విశేషంగా అనుకూలిస్తున్న ఈ పిచ్ పై 250 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం కష్టసాధ్యమే.
ఇవాళ్టి ఆటలో భారత పేస్ బౌలింగ్ పదునుకు పలువురు ఆసీస్ ఆటగాళ్ల హెల్మెట్లు కదిలిపోయాయి. బుమ్రా, ఉమేశ్, షమీలు సంధించిన బంతులు నేరుగా వారి తలల వైపు దూసుకెళ్లాయి. దాంతో భారత పేస్ త్రయాన్ని ఫ్రంట్ ఫుట్ పై ఎదుర్కొనేందుకు కంగారూలు నిజంగానే కంగారు పడ్డారు.