Sunil Gavaskar: ఆసీస్ ఆటగాళ్లకు మనవాళ్లు వారం ముందే క్రిస్మస్ కానుకలు ఇస్తున్నట్టుంది... భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ పై గవాస్కర్ వ్యంగ్యం
- అడిలైడ్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలిటెస్టు
- పలు క్యాచ్ లు జారవిడిచిన టీమిండియా
- రెండు లైఫ్ లు పొంది 47 పరుగులు చేసిన లబుషేన్
- భారత క్రికెటర్లు క్రిస్మస్ మూడ్ లో ఉన్నారన్న గవాస్కర్
- ఈ మ్యాచ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సన్నీ
అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో భారత ఆటగాళ్లు పలు క్యాచ్ లు వదిలివేయడం పట్ల మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఈ టెస్టు మ్యాచ్ కు గవాస్కర్ చానెల్ 7 తరఫున కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆసీస్ ఆటగాళ్ల క్యాచ్ లను టీమిండియా ఆటగాళ్లు డ్రాప్ చేయడాన్ని కామెంట్రీ బాక్సు నుంచి చూసిన గవాస్కర్ తనదైన శైలిలో విమర్శించారు.
ఆసీస్ ఆటగాళ్లకు మనవాళ్లు వారం ముందే క్రిస్మస్ కానుకలు ఇస్తున్నట్టుంది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "నేననుకోవడం ఏంటంటే భారత ఆటగాళ్లు క్రిస్మస్ పండుగ మూడ్ లో ఉన్నట్టున్నారు. లబుషేన్ వంటి బ్యాట్స్ మన్ కు రెండు లైఫ్ లు ఇవ్వడం అంటే క్రిస్మస్ కానుక ఇచ్చినట్టే" అని వ్యాఖ్యానించారు.
కాగా, రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లబుషేన్ 47 పరుగులు చేశాడు. మొదట షమీ బౌలింగ్ బౌండరీ లైన్ వద్ద బుమ్రా అతడిచ్చిన క్యాచ్ ను నేలపాలు చేయగా, ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ లో పృథ్వీ షా అతి తేలికైన క్యాచ్ ను జారవిడిచాడు. చివరికి లబుషేన్ ను ఉమేశ్ యాదవ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది.