Corona Virus: కరోనా వ్యాక్సిన్ పై ప్రజల సందేహాలను నివృత్తి చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

Centre tries to clarify doubts over corona vaccine

  • త్వరలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్
  • స్పష్టమైన సమాచారంతో ప్రకటన జారీ చేసిన కేంద్రం
  • మొదటివిడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్
  • 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు
  • ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ
  • కరోనా సోకినా వ్యాక్సిన్ తీసుకోవచ్చని వెల్లడి

మరికొన్నిరోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నడుంబిగించింది. ఈ మేరకు వ్యాక్సిన్లపై సమగ్ర సమాచారంతో ఓ ప్రకటన విడుదల చేసింది.

 దేశంలో మొదటివిడతగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయనున్నట్టు వెల్లడించింది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొదట వైద్య ఆరోగ్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా టీకా ఇస్తారు. ప్రాధాన్యతా క్రమంలో 50 ఏళ్లు పైబడిన వారికి, ఇతర వ్యాధిగ్రస్తులకు ఇస్తారు. తాము అందించే వ్యాక్సిన్ ఏ దేశాలకు తీసిపోని రీతిలో ఉంటుందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఇక ప్రజల సందేహాలు నివృత్తి చేసే క్రమంలో ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంది. కరోనా టీకా తీసుకోవడం అనేది తప్పనిసరేమీ కాదని, ఈ దిశగా ఎవరూ ఎవరినీ ఒత్తిడి చేయరని స్పష్టం చేసింది. తమకు ఇష్టమైతేనే ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని వివరించింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులకు, సమాజంలోనూ కరోనా వ్యాప్తిని నివారించే వీలుంటుందని తెలిపింది. ఇప్పటికే  కరోనా సోకిన వ్యక్తులు కూడా నిర్దేశిత డోసులో వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రెండో డోసు తీసుకున్న తర్వాత 14 రోజుల్లో శరీరంలో యాంటీబాడీలు ఉత్పన్నమై కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపింది.

ఇతర జబ్బులతో బాధపడుతున్న వారు కూడా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని... బీపీ, షుగర్, క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఇబ్బందేమీ ఉండదని తెలిపింది. ఇతర వ్యాక్సిన్ల తరహాలోనే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం స్వల్ప జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని భావిస్తే గుర్తింపు కార్డు సాయంతో ఆన్ లైన్ లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం ఫోన్ నెంబరుకు సందేశం వస్తుంది. అందులోని వివరాల ఆధారంగా వ్యాక్సిన్ పొందవచ్చు.

వ్యాక్సిన్ డోసు వేయించుకున్న తర్వాత అరగంట సేపు అక్కడే ఉండాలి. ఏదైనా రియాక్షన్ వస్తే వెంటనే వ్యాక్సిన్ పంపిణీ కేంద్రంలో ఉన్న ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి. వ్యాక్సిన్ పొందినప్పటికీ కరోనా జాగ్రత్త చర్యలు పాటించడం మాత్రం తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్యశాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ వ్యాక్సిన్, ఆక్స్ ఫర్డ్-సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్, స్పుత్నిక్ వి-డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వ్యాక్సిన్ తదితర వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ స్థాయుల్లో ఉన్నాయని వివరించింది.

  • Loading...

More Telugu News