Konda Surekha: గతంలో పొన్నాల లక్ష్మయ్య కారణంగానే టీఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వచ్చింది: కొండా సురేఖ దంపతులు
- ఓరుగల్లు రాజకీయాల్లో కీలకంగా ఉన్న కొండా దంపతులు
- పార్టీ మార్పు అంటూ ప్రచారం
- కాంగ్రెస్ ను వీడేదిలేదని కొండా సురేఖ, మురళి స్పష్టీకరణ
- టీఆర్ఎస్ దొరల పార్టీ అని విమర్శలు
ఓరుగల్లు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే కొండా సురేఖ, మురళి దంపతులు మీడియాతో మాట్లాడారు. చాలామంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వెళుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో తమ రాజకీయ ప్రస్థానంపై స్పష్టతనిచ్చారు. తాము కాంగ్రెస్ ను వదిలి వెళ్లబోమని అన్నారు. గతంలో ఓసారి పాన్నాల లక్ష్మయ్య కారణంగా టీఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తమకు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం టికెట్ నిరాకరించారని, అందుకే టీఆర్ఎస్ లో చేరామని వివరించారు. కానీ టీఆర్ఎస్ దొరల పార్టీ అని అర్థమైందని పేర్కొన్నారు.
ఇటీవలే కొండా సురేఖ, మురళి గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణికం ఠాగూర్ ను కలిసి నూతన పీసీసీ చీఫ్ ఎంపికలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్ పై దృష్టి సారించింది. వరంగల్ లో బలమైన వర్గం కలిగివున్న కొండా దంపతులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.