BJP: మాలేగావ్ పేలుళ్ల కేసు: ఎయిమ్స్‌లో చేరి, కోర్టుకు గైర్హాజరైన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్

 MP Pragya Thakur admitted to AIIMS to miss court appearance

  • రెగ్యులర్ చెకప్ కోసం ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రగ్యాసింగ్
  • ముగ్గురు మినహా మిగతా వారు గైర్హాజరు
  • అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలవల్లేనన్న నిందితుల తరపు న్యాయవాదులు

2008 మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణకు డుమ్మా కొట్టారు. ఈ కేసులో నిందితులైన ఏడుగురు కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. కరోనా కారణంగా చాలా కాలంపాటు నిలిచిపోయిన విచారణ ఈ నెల మొదట్లో తిరిగి ప్రారంభమైంది. నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

అయినప్పటికీ తాజా విచారణకు ముగ్గురు మినహా ప్రగ్యాసింగ్, రమేశ్ ఉపాధ్యాయ్, సుధాకర్ ద్వివేదీ, సుధాకర్ చతుర్వేదిలు హాజరు కాలేదు. కరోనా నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతోనే వీరు రాలేకపోయారని వారి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో నేడు వారికి సమన్లు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది.

కాగా, ఆరోగ్య పరీక్షల కోసం ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రగ్యాసింగ్‌ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. విచారణకు హాజరుకావడానికి ప్రగ్యాసింగ్ ముంబైకి రావాలని అనుకున్నారని, రెండు రోజులపాటు ఇక్కడే ఉండాలని అనుకున్నారని, అయితే, రెగ్యులర్ చెకప్ కోసం ఎయిమ్స్‌కు వెళ్లిన ఆమె వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరారని ఆమె తరపు న్యాయవాది జేపీ మిశ్రా కోర్టుకు తెలిపారు. అయితే, ఆమె ఎలాంటి చికిత్స తీసుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, 29 సెప్టెంబరు 2008న మాలేగావ్‌లో మసీదు సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు చనిపోగా, 100 మందికిపైగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News