Nigeria: నైజీరియాలో కిడ్నాప్ అయిన విద్యార్థులలో 344 మంది విడుదల

Boko Haram Releases Hundreds of Kidnapped Schoolboys

  • గత వారం ఓ స్కూలు నుంచి వందలాది మంది విద్యార్థుల అపహరణ
  • కొందరినే విడిచిపెట్టారన్న కత్సినా గవర్నర్
  • కిడ్నాపైన విద్యార్థుల సంఖ్య 500 పైమాటే!

నైజీరియాలో గత వారం ఓ స్కూలు నుంచి వందలాది మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన తీవ్రవాద సంస్థ బోకోహరామ్ గురువారం వారిలో చాలామందిని క్షేమంగా విడిచిపెట్టింది. మొత్తం 344 మంది విద్యార్థులను భద్రతా దళాలకు అప్పగించారని, ఇంకా కొందరి ఆచూకీ తెలియరావడం లేదని కత్సినా గవర్నర్ అమిను బెల్లో తెలిపారు.

‘‘చాలామంది విద్యార్థులను అప్పగించారు. కానీ అందరినీ కాదు’’ అని గవర్నర్ చెప్పినట్టు ప్రభుత్వ టీవీ చానల్ ఎన్‌టీఏ తెలిపింది. విడిచిపెట్టిన విద్యార్థులను సమీప రాష్ట్రం జంపారాలోని అటవీ ప్రాంతంలో గుర్తించినట్టు గవర్నర్ తెలిపారు.

విద్యార్థులను కత్సినా నగరానికి తీసుకెళ్తున్నామని, వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని నైజీరియా అధికారి ప్రతినిధి అబ్దుల్ లాబరాన్ పేర్కొన్నారు. కిడ్నాప్ అయిన విద్యార్థుల వీడియోను తీవ్రవాదులు సోషల్ మీడియాలో విడుదల చేసిన కాసేపటికే వారు విడుదలైనట్టు వార్తలు రావడం గమనార్హం.

ఈ నెల 11న వాయవ్య నైజీరియాలోని ఓ పాఠశాల నుంచి వందలాదిమంది విద్యార్థులను అపహరించి తీసుకెళ్లారు. వీరి సంఖ్య 520 వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు 344 మందిని మాత్రమే విడిచిపెట్టడంతో మిగతా విద్యార్థులు ఏమయ్యారన్న ఆందోళన నెలకొంది.

  • Loading...

More Telugu News