Telangana: వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు నిజాం చెంచా సీఎం కాబోడు: బీజేపీ నేత తరుణ్ ఛుగ్
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చూపించింది ట్రైలరే
- నిజాం పాలనను అంతమొందించే వరకు నిద్రపోను
- ప్రజా ధనాన్ని లూటీ చేయడంలో కేసీఆర్ కుటుంబం పోటీ
వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణకు ఏ రాజా సాబ్ కుమారుడో, అల్లుడో, నిజాం చెంచానో ముఖ్యమంత్రి కాబోడని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ అన్నారు. టీఆర్ఎస్‌తో తాము చేస్తున్నది డూప్ ఫైట్ కాదని, ఆ పార్టీతో కుస్తీకి సిద్ధంగా ఉన్నామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చూపించినది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నిజాం పాలనతోపాటు అవినీతిని అంతమొందించే వరకు బీజేపీ నిద్రపోదని తరుణ్ అన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో తండ్రీ కొడుకులు, మరికొన్ని రాష్ట్రాల్లో తల్లీ కూతుళ్ల పాలనను చూశామని, కానీ తెలంగాణను మాత్రం తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఆత్మబంధువు (మజ్లిస్)తో కూడిన కుటుంబం పాలిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడంలో ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌తో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేయడం మానొద్దని పార్టీ శ్రేణులకు ఛుగ్ పిలుపునిచ్చారు.