Jayaprakash Narayan: గవర్నర్ పదవిని ఇవ్వబోతున్నారనే వార్తలపై జయప్రకాశ్ నారాయణ స్పందన!
- గవర్నర్ పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేను
- సమాజాన్ని మార్చేందుకు ఎవరు ప్రయత్నించినా మద్దతిస్తాను
- నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు
లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవిని ఇవ్వబోతోందనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్తలపై జేపీ స్పందించారు. గవర్నర్ పదవిని స్వీకరించడానికి తాను సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగేలా, సమాజాన్ని మార్చేందుకు ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తే... తాను వారికి మద్దతుగా ఉంటానని చెప్పారు.
తాను రాజకీయాలకు వ్యతిరేకం కాదని జేపీ అన్నారు. రాజకీయాల ద్వారా మార్పును తీసుకొచ్చేందుకు తాను తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను తాను స్వాగతించానని చెప్పారు. ఆర్టీసీ స్ట్రయిక్ జరుగున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న స్టాండ్ కూడా కరెక్ట్ అని చెప్పానని తెలిపారు. పదవులు ఆశించి తాను అలా వ్యవహరించలేదని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సరైనవి అయినప్పుడు తాను కచ్చితంగా మద్దతుగా మాట్లాడతానని... సరైన నిర్ణయాలు కానప్పుడు వాటికి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తానని అన్నారు.