Labh Singh: కెనడా టూర్ రద్దు చేసుకుని ఢిల్లీ సరిహద్దుల్లో చేరిన సెలూన్ యజమాని... ఏం చేస్తున్నాడంటే..!
- హర్యానాలోని కురుక్షేత్రలో సెలూన్ నిర్వహిస్తున్న లాబ్ సింగ్
- లాబ్ సింగ్ కస్టమర్లలో అత్యధికులు రైతులే
- ఢిల్లీ బాట పట్టిన రైతులు
- వారితో పాటే సింఘు ప్రాంతానికి వచ్చిన లాబ్ సింగ్
- భార్య పుట్టినరోజు వాయిదా
హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతానికి చెందిన లాబ్ సింగ్ ఠాకూర్ ఓ సెలూన్ యజమాని. కురుక్షేత్రలో 'క్రేజీ బ్యూటీ సెలూన్' నడుపుతున్నాడు. లాబ్ సింగ్ సెలూన్ కు వచ్చేవారిలో అత్యధికులు రైతులే. అయితే, కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దు బాట పట్టారు. తన కస్టమర్లు ఢిల్లీ వద్ద నిరసనల్లో పాల్గొంటుండడంతో లాబ్ సింగ్ కూడా తన సెలూన్ సామానంతా సర్దుకుని సిబ్బంది సహా ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడే ఉంటూ రైతులకు ఉచితంగా క్షురక సేవలు అందిస్తున్నాడు. నిత్యం 100 మందికి తగ్గకుండా హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించాడు.
ముఖ్యమైన విషయం ఏంటంటే... లాబ్ సింగ్ తన భార్య పుట్టినరోజును కెనడాలో వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన కస్టమర్లు నిరసనల్లో పాల్గొంటుండడంతో వారికి సంఘీభావంగా తాను కూడా వారి వద్దకే చేరుకున్నాడు. ఈ క్రమంలో తన కెనడా పర్యటనను కూడా రద్దు చేసుకున్నాడు. ప్రతి ఏటా తన భార్య జన్మదిన వేడుకలను విదేశాల్లో జరుపుకునే లాబ్ సింగ్ ఈసారి రైతుల కోసం తన వ్యక్తిగత సంతోషాలను త్యాగం చేశాడు.