SII: వ్యాక్సిన్ తయారీ సంస్థలపై పనికిరాని కోర్టు కేసులు లేకుండా చూస్తేనే వ్యాక్సిన్ పై గెలుస్తాం: అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు
- సీరమ్ పై కేసు వేసిన చెన్నై వలంటీర్
- ఇటువంటి చర్యలతో సంస్థల ప్రతిష్ఠపై మచ్చ
- కేంద్రం వెంటనే కల్పించుకోవాలి
- గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ లో అదార్ పూనావాలా
కరోనా మహమ్మారిపై పోరాడేందుకు వ్యాక్సిన్లను తయారు చేస్తున్న కంపెనీలపై పనికిరాని కోర్టు కేసులు, వ్యాజ్యాల ప్రభావం లేకుండా చూడాలని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ అదార్ పూనావాలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి వస్తే కంపెనీలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన సూచించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న చెన్నైకి చెందిన ఓ వలంటీర్, తనకు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కోర్టును ఆశ్రయించిన తరువాత అదార్ పూనావాలా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఓ వలంటీర్ వేసిన వ్యాజ్యాల వల్ల కంపెనీ పేరు ప్రతిష్ఠలపై మరకలు పడ్డాయని పేర్కొన్న ఆయన, "ఈ తరహా కేసుల నుంచి వ్యాక్సిన్ తయారీ సంస్థలకు నష్టపరిహారం ఇవ్వాలి. కోవాక్స్ విషయంలో చాలా దేశాలు ఇప్పటికే ఆ పని చేస్తున్నాయి. ఇటువంటి తప్పుడు ఆరోపణల వల్ల మీడియాలోనూ వార్తలు వచ్చి, పరిస్థితులు మారుతున్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, ప్రభుత్వం కల్పించుకోవాలి. అన్యాయంగా అపఖ్యాతి పాలవకుండా వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతిష్ఠను కాపాడాలి. ప్రజలకు సరైన సమాచారాన్ని అందించేందుకు కృషి చేయాలి" అని కార్నేజ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2020లో ఆయన వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే, ప్రొటోకాల్ ప్రకారం తగు చర్యలు తీసుకుంటున్నామని అదార్ పూనావాలా వ్యాఖ్యానించారు. స్వల్పంగా మధ్యస్తంగా, తీవ్రంగా దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలన్న విషయమై ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని మంగళవారం నాడు ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో సీరమ్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలుత ఆరోగ్య రంగంలోని వారికి ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక వ్యాక్సిన్ తయారీ సంస్థలు సైతం పనికిమాలిన వ్యాజ్యాల గురించి పట్టించుకోకుండా, తమ పనిపై దృష్టిని సారించాలని, కేసుల గురించి పట్టించుకోవద్దని ఆయన కోరారు.
వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైన తరువాత చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని వ్యాఖ్యానించిన ఆయన, ఎన్నో దశాబ్దాలుగా కొత్త వ్యాక్సిన్ కనుగొన్న ప్రతి సమయంలోనూ ఇటువంటి క్లిష్ట పరిస్థితులే ఏర్పడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియాతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.