Kamareddy District: రెండు సంవత్సరాలుగా ఉత్తరాలు బట్వాడా చేయని పోస్టుమేన్.. పేరుకుపోయిన ఏడువేల ఉత్తరాలు!
- కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఘటన
- విధుల్లో చేరినప్పటి నుంచి ఉత్తరాలను బట్వాడా చేయని వైనం
- దాచిపెట్టిన వాటిలో ఆధార్, పాన్‌కార్డులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోలుకు చెందిన పోస్టుమేన్ బాలకృష్ణ విధి నిర్వహణలో వ్యవహరించిన నిర్లక్యం కారణంగా వేలాదిమంది విలువైన సమచారాన్ని కోల్పోయారు. పోస్టు చేయాల్సిన ఉత్తరాలను బట్వాడా చేయకుండా రెండేళ్లుగా తన వద్దే దాచుకున్నాడు. అతడి బద్దకం కారణంగా ఈ రెండేళ్లలో ఏకంగా 7 వేల ఉత్తరాలు పేరుకుపోయాయి. తమకు అందాల్సిన ఉత్తరాలు సంవత్సరాలు గడుస్తున్నా అందడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తనిఖీ చేసిన ఉన్నతాధికారులు అసలు విషయం తెలిసి విస్తుపోయారు.
12 సంచుల్లో ఏకంగా 7 వేల ఉత్తరాలు బట్వాడా కాకుండా అలానే ఉన్నాయి. అందులో రెండేళ్లనాటి ఉత్తరాలు కూడా ఉండడంతో షాకయ్యారు. అంతేకాదు, అందులో ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు, వివిధ పుస్తకాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు కూడా ఉండడం అధికారులను ఆశ్చర్యపరిచింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అతడిని సస్పెండ్ చేశారు. ఆ పోస్టుమేన్ పేరు బాలకృష్ణ. 2019 జనవరిలో బాన్సువాడ బీట్ 1 పోస్టుమేన్‌గా చేరాడు. విధుల్లో చేరినప్పటి నుంచి తాను ఉత్తరాలను బట్వాడా చేయడం లేదన్న అతడి మాటలు విని ఉన్నతాధికారులు విస్తుపోయారు.