Corona vaccine: రూ. 80 వేల కోట్లు వెచ్చిస్తే కానీ వ్యాక్సినేషన్ జరగదు: సీరం
- వ్యాక్సిన్ పంపిణీ, నిల్వ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది
- కోల్డ్ స్టోరేజీలకు నిత్యం తగినంత విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలి
- ఐటీ ఆధారిత సప్లై చైన్‌ను సిద్ధం చేసుకోవాలి
ఈ ఏడాది చివర్లో, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో దాని పంపిణీకి కేంద్రం ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కోసం భారత ప్రభుత్వం దాదాపు రూ. 80 వేల కోట్లను ఖర్చు చేయాల్సి రావొచ్చని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పేర్కొంది.
టీకా పంపిణీ, నిల్వ ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలంటే నిత్యం తగినంత విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్‌ను నిల్వచేసే కోల్డ్ స్టోరేజీలకు విద్యుత్ ఎంతో కీలకమని సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సతీశ్ డి.రావెత్కర్ పేర్కొన్నారు. అలాగే, ఐటీ ఆధారిత సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలని, వీటిన్నింటి కోసం ప్రభుత్వం రూ. 80 వేల కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని సతీశ్ అంచనా వేశారు.