Mohammad Kaif: టీమిండియా క్రికెటర్లు ఇక ఫోన్ స్విచాఫ్ చేస్తే మంచిది: మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్
- ఆసీస్ తో తొలి టెస్టులో టీమిండియా దారుణ ఓటమి
- వెల్లువలా వచ్చిపడుతున్న విమర్శలు
- ఈ ఓటమి నుంచి బయటపడాలన్న కైఫ్
- విమర్శలు వినకపోవడమే మంచిదని సూచన
- ఆటపై దృష్టి నిలిపాలని హితవు
ఐదు రోజులు ఆడాల్సిన టెస్టులో రెండున్నర రోజుల్లోనే చేతులెత్తేసిన టీమిండియాపై విమర్శల జడివాన కురుస్తోంది. ఆసీస్ తో తొలిటెస్టులో అత్యంత అవమానకర రీతిలో కోహ్లీ సేన ఓడిపోవడం పట్ల సామాజిక మాధ్యమాల్లో ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
ఈ దారుణ పరాజయం తాలూకు సంక్షోభం నుంచి బయటపడడం టీమిండియా ముందున్న తక్షణ కర్తవ్యం అని స్పష్టం చేశాడు. అందుకోసం టీమిండియా ఆటగాళ్లు ముందు తమ ఫోన్లు స్విచాఫ్ చేసుకోవాలని, బయట ఏం మాట్లాడుకుంటున్నారన్న అంశాన్ని పట్టించుకోకపోవడమే మంచిదని హితవు పలికాడు. ఓ బృందంలా కలిసికట్టుగా శ్రమిస్తూ జరగాల్సిన దానిపై దృష్టి సారించాలని సూచించాడు.
రాబోయే టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించే అజింక్యా రహానే జట్టును ఏకతాటిపై నిలపాల్సిన అవసరం ఉందని, జట్టుపై తనదైన ముద్రను వేయాలని కైఫ్ తెలిపాడు. కాగా, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ లో జరగనుంది.
తన భార్య అనుష్క మొదటి బిడ్డను ప్రసవించనుండడంతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ తిరిగి వస్తుండగా, అతడి స్థానంలో అజింక్యా రహానే జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.