Patanjali: పతంజలి 'కరోనిల్'తో ప్రయోజనం లేదు... అనుమతి ఇవ్వబోమన్న యూకే!
- జూన్ లో మార్కెట్లోకి కరోనిల్ కిట్
- రూ. 250 కోట్లకు పైగా వ్యాపారం
- వైరస్ ను అడ్డుకోలేదన్న బర్మింగ్ హామ్ వర్శిటీ
యోగా గురువు బాబా రామ్ దేవ్ సంస్థ పతంజలి ఆయుర్వేద తయారు చేసిన 'స్వసారి - కరోనిల్ కిట్' వాడకం వల్ల ఏ మాత్రమూ ఉపయోగం లేదని తేల్చిన బ్రిటన్, వీటి విక్రయానికి అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఈ మేరకు బ్రిటీష్ వైద్య ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) ఓ ప్రకటన చేసింది. అనుమతి లేకుండా ఔషధాలు, హెల్త్ ప్రొడక్టులను యూకేలో విక్రయిస్తే, కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.
కాగా, ఈ సంవత్సరం జూన్ 23న బాబా రామ్ దేవ్ కరోనిల్ కిట్లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని తొలుత ప్రచారం చేసుకున్న పతంజలి, ఆపై దీన్ని రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా మాత్రమే పేర్కొన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ వరకు దాదాపు 25 లక్షల కిట్లను విక్రయించిన సంస్థ రూ. 250 కోట్లకు పైగా వ్యాపారం జరిపింది కూడా.
కరోనిల్ కిట్లపై పరిశోధనలు జరిపిన యూకేలోని బర్మింగ్ హామ్ యూనివర్శిటీ, వీటితో ఎటువంటి ఉపయోగమూ లేదని తేల్చి చెప్పింది. కరోనా వైరస్ ను ఇది ఏ మాత్రమూ అడ్డుకోలేదని, కనీసం కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుందని ఆధారాలు లేవని వర్శిటీ వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ పేర్కొన్నారు. వృక్ష సంబంధిత పదార్థాలతో ఇది తయారైందని, దీనికి కరోనాను ఎదుర్కొనే శక్తి లేదని తెలిపారు.