Test: తనపై విమర్శలకు ఇన్ స్టాలో స్పందించిన పృథ్వీ షా!
- తొలి టెస్టులో ఆడేందుకు అవకాశం
- 0, 4 పరుగులకే పరిమితమైన పృథ్వీ షా
- మిగతా మ్యాచ్ లలో ఆడే అవకాశం దాదాపు లేనట్టే
పృథ్వీ షా... ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఎంపికైనా, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో డక్కౌట్ అయిన పృథ్వీ, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులకు మాత్రమే పరిమితం అయ్యాడు. ఈ సంవత్సరంలో తానాడిన ఏ మ్యాచ్ లోనూ పృథ్వీ రాణించలేదు.
ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన తరువాత, ఐపీఎల్ లోనూ ప్రతిభను కనబరచలేకపోయిన పృథ్వీ, గత రికార్డును దృష్టిలో పెట్టుకుని తొలి టెస్ట్ కు చాన్సిచ్చారు. ఇదే సమయంలో ప్రాక్టీస్ మ్యాచ్ లలో రాణిస్తున్న శుభమన్ గిల్ ను పక్కన బెట్టడంపై పలువురు మాజీలు మ్యాచ్ కు ముందే విమర్శలు గుప్పించారు.
ఇక తనపై వచ్చిన విమర్శలకు మీడియా ముందు సమాధానం ఇవ్వలేకపోయిన పృథ్వీ షా, తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. "ఎవరైనా ఏదైనా చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే, కొందరు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అంటే తాము ఏదో చేయగలమని, వాళ్లు ఏమీ చేయలేరని అర్థం" అంటూ సెటైర్ వేశాడు.
కాగా, తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన పృథ్వీని, రెండో టెస్ట్ కు ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. అదే నిజమైతే మిగతా టెస్టుల్లో పృథ్వీ కనిపించే అవకాశాలు తక్కువే. తొలి టెస్టు తరువాత కోహ్లీ ఇండియాకు తిరిగి రానున్న నేపథ్యంలో కనీసం రెండు కొత్త ముఖాలు కనిపించవచ్చని తెలుస్తోంది.