Prashant Kishor: అమిత్ షా చెప్పినట్టు జరిగితే ట్విట్టర్ ను వదిలేస్తా: ప్రశాంత్ కిశోర్
- బెంగాల్ లో బీజేపీకి కనీసం 200 సీట్లు వస్తాయన్న అమిత్ షా
- బీజేపీ సీట్లు రెండంకెల సంఖ్యను దాటవన్న ప్రశాంత్ కిశోర్
- డబుల్ డిజిట్ దాటితే ట్విట్టర్ ను వదిలేస్తానని వ్యాఖ్య
ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ లో మమతాబెనర్జీ పార్టీ అయిన టీఎంసీకి పని చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు బెంగాల్ లో బీజేపీ దూకుడు పెంచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 200 స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను చూసి కొందరు నవ్వుకోవచ్చని... పక్కా ప్రణాళిక ప్రకారం పని చేస్తే 200 సీట్లను దాటుతామని చెప్పారు.
అమిత్ షా వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ... బీజేపీకి దక్కే స్థానాలు రెండంకెల సంఖ్యను దాటవని అన్నారు. డబుల్ డిజిట్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందితే... తాను ట్విట్టర్ ను వదిలేస్తానని చెప్పారు. తాను చేసిన ఈ ట్వీట్ ను సేవ్ చేసి పెట్టుకోవాలని అన్నారు. బీజేపీకి మద్దతిస్తున్న మీడియా ఎంత ప్రచారం చేసినా... బీజేపీకి రెండంకెల సంఖ్యకు మించి స్థానాలు రావని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.