Yogi Adityanath: కేసును సీబీఐకి అప్పగించాలని యోగి ముందే నిర్ణయించుకున్నారు: హత్రాస్ రేప్ ఘటనపై యూపీ మంత్రి
- మొదట్నుంచీ బాధిత కుటుంబానికి అండగా ఉన్నారు
- సీఎం పోలీసులను నమ్మలేదని మంత్రి వ్యాఖ్య
- పోలీసులంతా మంచోళ్లే ఉండరన్న సునీల్ భరాలా
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సునీల్ భరాలా అన్నారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటి నుంచీ అండగా నిలిచారని, కేసు దర్యాప్తులో ఆయన పోలీసులను నమ్మలేదని చెప్పారు. కేసును సీబీఐకి అప్పగించాలని యోగి ముందే నిర్ణయించుకున్నారని అన్నారు. పోలీసుల్లో అందరూ మంచోళ్లే ఉండరు కదా? అని వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 14న యూపీలోని హత్రాస్ లో 20 ఏళ్ల దళిత యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తర్వాత ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే, పోలీసులు సెప్టెంబర్ 30న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండానే రాత్రికిరాత్రే అంత్యక్రియలు నిర్వహించేశారు.
దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు అక్టోబర్ లో ఆదేశాలిచ్చింది. కేసుకు సంబంధించి గత వారమే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని నిర్ధారించింది. నలుగురు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసింది. దర్యాప్తును పూర్తి చేయడానికి మరికొంత టైం కావాలని చార్జిషీట్ నమోదు చేసినప్పుడు సీబీఐ కోరింది. ఆ రిక్వెస్ట్ ను పరిగణనలోకి తీసుకున్న అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం.. జనవరి 27 వరకు గడువిచ్చింది.
మరోవైపు తమ నలుగురిని కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపిస్తూ నిందితుల్లో ఒకరు జైలు నుంచే యూపీ పోలీసులకు లేఖ రాశాడు. బాధితురాలి అమ్మానాన్న, సోదరులే ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారని లేఖలో ఆరోపించాడు. ఆ ఆరోపణలను బాధితురాలి కుటుంబం ఖండించింది.