Jagan: రైతుల భూములు కబ్జాలు చేసే రాబందులున్నాయి... ప్రక్షాళన కోసమే సమగ్ర సర్వే: సీఎం జగన్
- ఏపీలో భారీ స్థాయిలో భూ సర్వే
- వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ప్రారంభం
- భూ సర్వేకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్
- జగ్గయ్యపేటలో ప్రసంగం
- సామాన్యుడి భూమికి రక్షణ కల్పిస్తామని భరోసా
ఏపీలో భారీ ఎత్తున భూ సర్వే నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో ఇవాళ ప్రారంభించారు. అనంతరం జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రైతుల భూములు కబ్జాలు చేసే రాబందులు ఉన్నాయని, భూ అక్రమాలను ప్రక్షాళన చేసేందుకే సమగ్ర సర్వే చేపడుతున్నామని వెల్లడించారు. సామాన్యుడి భూమికి శాశ్వత రక్షణ కల్పించడమే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
రైతులు ప్రాణప్రదంగా భావించే భూమిని కొందరు కబ్జాకోరులు కబళించి కోట్లకు పడగలెత్తుతున్నారని, తినీ తినకా కూడబెట్టిన సొమ్ముతో కొన్న భూములు వివాదంలో చిక్కుకుంటే రైతు బాధ ఎలా ఉంటుందో తాను పాదయాత్ర సమయంలో గ్రహించానని సీఎం జగన్ వెల్లడించారు. అందుకే, ఆస్తుల రికార్డు పక్కాగా ఉంటే ఇలాంటి కబ్జాసురులపై చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రజల ఆస్తుల రికార్డులు భద్రంగా ఉండాలన్న అభిమతంతోనే 100 ఏళ్ల అనంతరం సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని వివరించారు. ఈ భారీ కొలతల కార్యక్రమంలో 16,000 మంది సర్వేయర్లు పాలుపంచుకుంటున్నారని, భూమి యజమానిపై ఒక్క పైసా కూడా భారం పడదని సీఎం భరోసానిచ్చారు.